man for sale: మంటగలిసిన మానవత్వం... పట్టపగలు, నడిబజార్లో అమ్మకానికి మనిషి!
- లిబియాలో మనుషుల అమ్మకాలు
- ఆరోగ్యంగా, బలంగా ఉన్న మనిషికి గిరాకీ
- ఒక్కో మనిషి ధర 26,000 రూపాయలు
యావత్ప్రపంచం సిగ్గుతో తలదించుకునే ఘటన లిబియాలో వెలుగుచూసింది. పట్టపగలు, నడిరోడ్డుమీద నిలువెత్తు మనిషి విక్రయ వస్తువయ్యాడు. ఈ సంఘటన లిబియా రాజధాని ట్రిపోలీలో చోటుచేసుకుంది. ‘‘బాగా పనిచేయగలిగిన శక్తిమంతుడు నా దగ్గరున్నాడు. ఎవరికైనా కావాలా?’’ అని ఓ వ్యక్తి వేలం పాట ప్రారంభించగానే, 'నా పాట 800, నాది 1000, నా పాట 1200' అంటూ కొనుక్కోవడం. ఆ వెంటనే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ పాటను ముగించడం.. 600 లిబియా దీనార్ల (400 అమెరికా డాలర్లు) కు అతనిని కొనుగోలు చేయడం జరిగింది. సెల్ ఫోన్ తో చిత్రీకరించిన ఆ దృశ్యాలను సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రసారం చేసింది.
సంక్షోభాలతో అతలాకుతలమైన ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు వలస వెళ్లిపోతున్న శరణార్థుల్ని పట్టుకున్న లిబియా స్మగ్లర్లు అంగడి సరుకుల్లా వారిని విక్రయిస్తున్నారు. ఒక్కొక్క నైజీరియన్ ను కేవలం 26 వేల రూపాయల (400 డాలర్ల) కు విక్రయిస్తున్నారు. వీరిని రోజువారీ కూలీలుగా, వ్యవసాయ, నిర్మాణ రంగ కూలీలుగా పనిచేయించుకోవడానికి కొనుక్కుంటున్నారు. ఆరోగ్యంగా ఉండి, కండబలం ఎక్కువగా ఉన్న యువకులు ఎక్కువ రేటు పలుకుతున్నారు.
సూడాన్ నుంచి లిబియా గుండా ఇటలీ చేరుకోవాలంటే ఒక జంటకు 3,500 డాలర్లు (2,28,000 రూపాయలు) ఖర్చవుతోంది. మరోపక్క ఈ స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు వారి పడవలపై ఐరోపా దేశాల కోస్ట్ గార్డ్స్ విరుచుకుపడుతున్నారు. దీంతో వారిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని స్మగ్లర్లు వారిని ఇలా వేలంలో విక్రయిస్తున్నారు. ఇంతవరకు సామాజిక మాధ్యమాల ద్వారా వారిని స్మగ్లర్లు విక్రయానికి ఉంచేవారు. అయితే ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వాటికి అడ్డుకట్ట వేయడంతో స్మగ్లర్లు బహిరంగ మార్కెట్లో వారిని విక్రయిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పెను కలకలం రేపుతోంది.