vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఇంట్లో ఐటీ దాడుల 'ఫన్నీ' వీడియో .. ఇదిగో చూడండి!
- మెర్సల్ సినిమాకి మద్దతు ప్రకటించిన విశాల్
- ప్రకటన మరుసటి రోజు విశాల్ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులంటూ వార్తలు
- వీడియో విడుదల చేసిన విశాల్
- వీడియో చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు
తమిళంలో ఇటీవల విడుదలై విజయం సాధించిన 'మెర్సల్' సినిమాలో వున్న జీఎస్టీ డైలాగ్స్ ను కోలీవుడ్ లో మొదటిగా సమర్థించింది హీరో విశాల్ అన్న సంగతి తెలిసిందే. విశాల్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విశాల్ పెద్ద మొత్తంలో పన్నులు ఎగ్గొట్టాడన్న విశ్వసనీయ సమాచారంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీఐ) దాడులు నిర్వహించిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ దాడులకు సంబంధించినదంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో 2,000 రూపాయల నోట్ల కట్టలను ఐటీ అధికారులు లెక్కిస్తూ విశాల్ ను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అది తన కష్టార్జితమని విశాల్ చెప్పడం, ఆ డబ్బు లెక్కల్లో లేనిదని అధికారులు చెప్పడం కనిపిస్తుంది. దీంతో కంగారు పడిన విశాల్ వీడియో ఆఫ్ చెయ్యమని వేడుకోవడం కనిపిస్తుంది. ఈ సమయంలో అర్జున్ ప్రవేశించి, సీన్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే ఏంటయ్యా ఇదంతా అని అడగడం కనిపిస్తుంది. దీంతో అందరూ నవ్వేయగా, ఆ నోట్ల కట్టలు నిజం కాదని తెల్లకాగితాలని చూపించడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విశాల్.. సెన్సాఫ్ హ్యుమర్ కి అభిమానులు హాట్సాఫ్ చెబుతున్నారు.