nandi awards: ఇవి కమ్మ అవార్డులు.. నంది అవార్డులు కాదు!: నల్లమలుపు బుజ్జి ఫైర్
- ఏకపక్షంగా నచ్చినవారికి అవార్డులు ఇచ్చేశారు
- ప్రభాస్ కు అవార్డ్ ఎందుకివ్వలేదు?
- అవార్డులు మొత్తం కమ్మ లాబీయింగ్ లా ఉంది
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నిర్మాత నల్లమలుపు బుజ్జి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం, కమిటీ మెంబర్లు ఏకపక్షంగా నచ్చినవారికి అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయారని విమర్శించారు. అల్లు అర్జున్ కు హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రేసుగుర్రం సినిమా అనేక వేదికలపై అవార్డులను గెలుచుకుందని... కానీ, నంది అవార్డు రాకపోవడం బాధగా ఉందని చెప్పారు. హిట్ సినిమా తీసి, అవార్దు రాకపోతే దాని బాధ ఏంటో తెలుస్తుందని అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ పిచ్చిగా మాట్లాడుతున్నారని... ఆయనకు ఒకటే చెబుతున్నానని... 'ముందు హిట్ సినిమా తీయండి, ఆ తర్వాత మాట్లాడండి' అని అన్నారు. రేసుగుర్రం సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిందని... అంత ప్రజాదరణ పొందిన సినిమాకు అవార్డు ఇవ్వకపోతే ఎలాగని అన్నారు. తన కెరియర్ లోనే రేసుగుర్రం అతి గొప్ప సినిమా అని చెప్పారు. కంటితుడుపు కోసం ఏవో రెండు అవార్డులు ఇచ్చి, సరిపెట్టుకున్నారని అన్నారు. ప్రజలు మెచ్చిన సినిమాను ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పారు. తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తేనే... తమకు ఇంకా మంచి సినిమాలు తీయాలనే తపన కలుగుతుందని తెలిపారు. ఎప్పడూ మీడియా ముందుకు రాని తాను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి కారణం కడుపుమండటమే అని చెప్పారు.
నంది అవార్డులు మొత్తం కమ్మ లాబీయింగ్ లా ఉందని... ఇవి కమ్మ అవార్డుల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రుద్రమదేవిలాంటి చారిత్రక సినిమాకు అవార్డు ఇవ్వలేదని.. శాతకర్ణిలాంటి సినిమాలకైతే ఇచ్చుకుంటారని దెప్పి పొడిచారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు అవార్డ్ ఇవ్వచ్చు కదా? అని అన్నాడు.