Restaurant: భోజన ప్రియులకు శుభవార్త.. అమాంతం తగ్గిన జీఎస్టీ!
- 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
- నేటి నుంచే అమల్లోకి..
- వినియోగదారుపై ఇక ఐటీసీ బాదుడు లేనట్టే
భోజన ప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లపై విధించిన 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెస్టారెంట్లలో భోజనం మరింత చవక కానుంది. గువాహటిలో జీఎస్టీ కౌన్సిల్ నిర్వహించిన 23వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలో మాత్రం రెస్టారెంట్లకు ఎటువంటి మినహాయింపు లేదు. ఇక జీఎస్టీకి రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం.
నవంబరు 1 నుంచి రెస్టారెంట్లలో కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే వినియోగదారులపై ఐటీసీ భారం కూడా పడుతుండడంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాజా నిబంధనలు తీసుకొచ్చారు. ఐటీసీని వినియోగదారులపై మోపకుండా దానిని రెస్టారెంట్ యజమానులే భరించేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చారు.
వినియోగదారులు తిన్న పదార్థాలపై మాత్రమే జీఎస్టీ విధించేలా సవరించారు. తాజా నిబంధన నేటి నుంచే అమల్లోకి రానుంది. ఫలితంగా రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు చవక కానున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఎఫ్‌హెచ్ఆర్ఏఐ అధ్యక్షుడు గిరీష్ ఒబెరాయ్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీని తగ్గించడం వల్ల రెస్టారెంట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.