antarcitica: అంటార్కిటికా నుంచి విడిపోతున్న అతిపెద్ద ఐస్ బర్గ్... ఫొటోలు విడుదల చేసిన నాసా
- దగ్గరి నుంచి ఫొటోలు తీసిన నాసా శాస్త్రవేత్తలు
- డెలావరే రాష్ట్రమంత పరిధిలో ఉన్న మంచు కొండ
- ప్రపంచ చరిత్రలో అతి భారీ మంచు కొండ
అంటార్కిటికా నుంచి విడిపోయి మహాసముద్రంపై తేలియాడుతున్న అతిపెద్ద ఐస్ బర్గ్ చిత్రాలను నాసా సైంటిస్టులు దగ్గరి నుంచి ఫొటోలు తీసి విడుదల చేశారు. ప్రపంచ చరిత్రలో అంటార్కిటికా నుంచి విడిపోయిన అతి భారీ మంచు కొండల్లో ఇది ఒకటని, డెలావరే రాష్ట్రం ఎంత పరిధిలో ఉంటుందో సుమారు అంత వైశాల్యంలో ఇది ఉందని వెల్లడించారు.
"నేను దిగ్భ్రాంతి చెందాను. మేము ఈ ఐస్ బర్గ్ మీదే ప్రయాణించాం. మంచు పర్వతంలో ఓ భాగంగానే ఇది కనిపించింది. ఇది ఎంతో పెద్దది" అని అక్టోబర్ లో ఐస్ బ్రిడ్జి ఆపరేషన్ కోసం అంటార్కిటికా వెళ్లిన నాసా టీమ్ శాస్త్రవేత్త నాథన్ కుర్ట్స్ వ్యాఖ్యానించారు. అది అంటార్కిటికా ఖండం నుంచి పూర్తిగా విడిపోయిందని, విషయం పూర్తిగా తెలుసుకుని తాము షాక్ కు గురయ్యామని చెప్పుకొచ్చారు. దీనికి ఏ-68 అని పేరు పెట్టినట్టు చెప్పారు. కాగా, ఈ సంవత్సరం జూలైలో 2,200 చదరపు మైళ్ల వైశాల్యమున్న మంచు కొండ నీటిపై తేలుతోందని శాటిలైట్ చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే.