open defecation free: బహిరంగ మలవిసర్జన చేసే వారికి డ్రోన్ కెమెరాలతో చెక్.. కరీంనగర్ పోలీసుల వినూత్న ప్రయత్నం!
- ప్రయత్నం అమలు చేస్తోన్న కరీంనగర్ పోలీసులు
- లోయర్ మానేరు డ్యామ్ చుట్టుపక్కల డ్రోన్ల గస్తీ
- మలవిసర్జన చేసే వారి ఫొటోలు తీసే ప్రయత్నం
నాలుగు జిల్లాల ప్రజలకు మంచినీటి అవసరాలను తీరుస్తున్న లోయర్ మానేరు డ్యామ్ నీటిని కలుషితం కాకుండా చూసేందుకు దాని చుట్టుపక్కల బహిరంగ మలవిసర్జనను అరికట్టాలని కరీంనగర్ పోలీసులు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. డ్రోన్ కెమెరాల సాయంతో బహిరంగ మలవిసర్జన చేసే వారిని ఫొటోలు తీయాలనే ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేశారు.
బహిరంగ మలవిసర్జన చేస్తూ ఈ డ్రోన్ కెమెరాల్లో చిక్కిన వారికి పూలదండలు వేసి అవమానించడానికి స్థానికంగా ఉన్న లేక్ వాకర్స్ అసోసియేషన్‌తో పోలీసులు ఒప్పందం చేసుకున్నారు. ఇది కేవలం మంచినీరు కలుషితం కాకుండా చూసేందుకు డ్యామ్ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నమేనని కరీంనగర్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు.