China: తమ దేశంలోని క్రిస్టియన్లకు చైనా సరికొత్త ఆదేశాలు!
- పేదలకు అందించే ప్రయోజనాలు కావాలంటే జిన్ పింగ్ ఫొటో పెట్టుకోండి
- ఏసుక్రీస్తు మీ పేదరికాన్ని పోగొట్టలేడు
- మిమ్మల్ని ధనవంతుల్ని చేసేది చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే
దేశంలోని క్రిస్టియన్లకు చైనా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసుక్రీస్తు ఫొటోలను తీసేసి, ఆ స్థానంలో జిన్ పింగ్ ఫొటోలను పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని గుగాన్ కౌంటీలోని క్రిస్టియన్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు... ఏసుక్రీస్తు మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురాలేడని... మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేసేది కేవలం చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని చెబుతున్నారు.
మిమ్మల్ని ధనికులుగా మార్చేది చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని హితబోధ చేస్తున్నారు. చైనాలో 11 శాతం ప్రజలు పేదరికంలో ఉండగా... వారిలో ఎక్కువ మంది క్రిస్టియన్లే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పేదలకు అందించే ప్రయోజనాలు కావాలంటే ఏసుక్రీస్తు స్థానంలో జిన్ పింగ్ ఫొటోను పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు క్రిస్టియన్లు క్రీస్తు స్థానంలో జిన్ పింగ్ ఫొటోలను పెట్టుకున్నారు. ఈ విషయాన్ని చైనా పత్రికలు వెల్లడించాయి.