sehwag: దేశంలో మొదటి బాల అమర వీరుడు... బాలల దినోత్సవం సందర్భంగా గుర్తుచేసిన సెహ్వాగ్
- వరుసగా ఐదు ట్వీట్లలో బాలుడి కథను వివరించిన క్రికెటర్
- దేశం కోసం ప్రాణాలిచ్చిన బాజీ రౌత్
- పన్నెండేళ్ల వయసులోనే బ్రిటీషర్లకు ఎదురుదిరిగిన వైనం
బాలల దినోత్సవం అనగానే బోసినవ్వులు కురిపించే చిన్నారులు, అత్యుత్తమ టాలెంట్‌ను ప్రదర్శించిన పిల్లలను ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. అందుకు భిన్నంగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బాల అమరవీరుడిని దేశానికి పరిచయం చేశారు. 12 ఏళ్ల వయసులో బ్రిటిషర్లకు ఎదురుతిరిగి, అసువులు బాసిన బాజీ రౌత్ గురించి ఐదు ట్వీట్లలో వివరించి అతని గొప్పతనాన్ని నేటి యువతకు తెలిసేలా చేశాడు.
1938 అక్టోబర్ 11న ఒడిశాలోని ధేన్‌కనల్ జిల్లా నీలకంఠపూర్‌లో జరిగిన సంఘటనను సెహ్వాగ్ ట్వీట్‌లో తెలిపాడు. ప్రజామండల్ ఆందోళన్ బాలల వర్గంలో సభ్యుడైన బాజీ రౌత్, బ్రాహ్మణి నది పడవల రక్షకుడిగా ఉండేవాడు. బ్రిటీషువారు అమాయకులను అకారణంగా చంపేస్తున్నారని తెలుసుకున్న బాజీ రౌత్, వారి బలగాలను బ్రాహ్మణి నది దాటించేందుకు సహాయపడలేదు.
బాజీ రౌత్ తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కోపోద్రిక్తుడైన బ్రిటీషు అధికారి ఒకరు అతని తలమీద తుపాకి వెనుక భాగంతో కొట్టాడు. దీంతో అక్కడే పడిపోయిన బాజీ... తన ప్రాణం ఉన్నంత వరకు బలగాలను నది దాటనివ్వనని హెచ్చరించాడు. అప్పుడు తుపాకి పేల్చి బాజీ రౌత్‌ను బ్రిటీష్ బలగాలు హతమార్చాయి. అతనితో పాటు అతని స్నేహితులు లక్ష్మణ్ మాలిక్, ఫాగు సాహూ, హృషీ ప్రధాన్, నాటా మాలిక్‌లను కూడా బ్రిటిష్ సైనికులు చంపేశారు.
చిన్నవయసులోనే స్వాతంత్ర్యం అర్థం తెలుసుకుని, దేశం కోసం ప్రాణాలిచ్చిన బాజీ రౌత్‌ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. సెహ్వాగ్ చేసిన ట్వీట్లను దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ అభినందించారు.