China: ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ కార్గో షిప్‌ను ప్రారంభించిన చైనా!
- రెండు గంటల చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
- 2 వేల టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం
- పూర్తి పర్యావరణ హితం
ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి ఎలక్ట్రిక్ షిప్‌ను చైనా ప్రారంభించింది. రెండు గంటల చార్జింగ్‌తో 2 వేల టన్నుల బరువుతో 80 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఈ షిప్ సొంతం. 70.5 మీటర్ల పొడవున్న ఈ ఓడ బరువు 600 టన్నులు. దక్షిణ చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌ఝౌలో ఈ ఓడను ప్రారంభించారు.
గ్వాంగ్‌ఝౌ షిప్‌యార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ ఈ వెస్సెల్‌ను నిర్మించింది. చార్జింగ్ కోసం 26 టన్నుల లిథియమ్ బ్యాటరీని ఓడలో ఏర్పాటు చేశారు. గంటకు అత్యధికంగా 12.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది పూర్తిగా పర్యావరణ హితం. కార్బన్, సల్ఫర్, పీఎం 2.5 వంటి పర్యావరణానికి హాని చేసే వాయువులు విడుదల కావు. దీనిని ప్రయాణికుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.