Hyderabad: హైదరాబాద్ మెట్రోరైల్ స్టేషన్ల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష!
- తేల్చి చెప్పిన హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ
- విధ్వంసక చర్యలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష
- మెట్రోరైల్ చట్టం ప్రకారం సెక్షన్-74 కింద కఠిన శిక్షలు
- ఈ నెల 28న మెట్రోరైల్ ప్రారంభమయ్యే అవకాశం
హైదరాబాద్ వాసుల కలల బండి మెట్రోరైల్ ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 28న మెట్రోరైల్ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. మెట్రోరైలు స్టేషన్ల వద్ద కానీ, రైలులో కానీ పోకిరీలు అనుచిత ప్రవర్తన కనబర్చినా, విధ్వంసానికి పాల్పడినా జైలుకి వెళ్లాల్సిందేనని హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించి నియమ నిబంధనలను విడుదల చేసింది.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. విధ్వంసక చర్యలకు పాల్పడితే మెట్రోరైల్ చట్టం ప్రకారం సెక్షన్-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో అతిక్రమణలకు పాల్పడితే చిక్కులు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి మెట్రో స్టేషన్లలో సీసీ కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే దుండగులు తప్పించుకోలేరు.