shivaji raja: తన బిడ్డకి సాయం చేశాననే కృతజ్ఞతతో నాకు కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు: శివాజీరాజా
- తన బిడ్డకు గుండె ఆపరేషన్ అంటే సాయం చేశాను
- తన ఊరుకు తీసుకెళ్లి 'నా దేవుడు' అంటూ పరిచయం చేశాడు
- నాకు ప్రమాదం జరిగిందని తెలిసి పరిగెత్తుకు వచ్చాడు
- 13 రోజుల పాటు హాస్పిటల్ దగ్గరే వున్నాడు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగానే కాదు .. మంచి మనసున్న వ్యక్తిగా శివాజీరాజాకి పేరుంది. అలాంటి శివాజీరాజా తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "ఫిల్మ్ నగర్లో 'అమృతం' సీరియల్ షూటింగ్ జరుగుతుండగా, చిన్న కుర్రాడిని వెంటబెట్టుకుని శంకర్ గౌడ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. తన కొడుకు గుండె జబ్బుతో బాధపడుతున్నాడనీ, ఆపరేషన్ చేయించాలంటే 35 వేలు అవుతుందన్నారని చెప్పాడు"
"అప్పట్లో ఆ మొత్తం నాకు చాలా ఎక్కువే అయినా, వెంటనే ఆ వ్యక్తికి ఆ డబ్బు ఏర్పాటు చేశాను. ఆ తరువాత కొంతకాలానికి ఆ వ్యక్తి వచ్చి నన్ను కలిశాడు. తన ఊరులో జరిగే జాతరకు నన్ను తీసుకెళ్లి, "నా బిడ్డను బతికించిన దేవుడు" అంటూ అక్కడి వాళ్లకి పరిచయం చేశాడు. అప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ తరువాత నాకు యాక్సిడెంట్ అయిందనీ .. కిడ్నీ దెబ్బతిందని ఎవరో చెప్పారట. దాంతో ఆ వ్యక్తి హాస్పిటల్ కి వచ్చి .. "మా సార్ కి నేను కిడ్నీ ఇస్తాను" అంటూ ఆ 13 రోజులు హాస్పిటల్ దగ్గరే వున్నాడు. నేను స్పృహలోకి వచ్చి కిడ్నీలు బాగానే ఉన్నాయని చెప్పేవరకూ వెళ్లలేదు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.