balochistan: లండన్ బస్సులపై పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు.. పాక్ కు షాక్!
- బలోచ్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు
- పాక్ చర్యలను ఎండగడతాం
- 'ఫ్రీ బలోచిస్తాన్' అంటూ నినాదాలతో కూడిన పోస్టర్లు
స్వాతంత్ర్యం కోసం బలోచిస్తాన్ ప్రజలు చేస్తున్న ఆందోళనపై పాక్ ప్రభుత్వం, సైన్యం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్' మరోసారి భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించింది. లండన్ లోని ప్రజారవాణా వ్యవస్థను తమ ఉద్యమానికి ప్రచార అస్త్రంగా మలచుకుంది. ఫ్రీ బలోచిస్తాన్ (బలోచిస్తాన్ కు స్వాతంత్ర్యం కావాలి) అనే నినాదాలతో కూడిన పోస్టర్లను లండన్ బస్సులపై అతికించి ప్రచారం మొదలెట్టారు. దీంతో లండన్ రోడ్లపై బలోచ్ నినాదాలు కనపడడంతో పాకిస్థాన్ మరోసారి షాక్ కు గురైంది.
ఈ సందర్భంగా వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి భవల్ మెంగల్ మాట్లాడుతూ, బలోచ్ ప్రజల హక్కులను కాలరాస్తున్న పాకిస్థాన్ చర్యలను ఎండగడతామని తెలిపారు. బలోచిస్తాన్ లో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ పై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకే లండన్ లో మూడవ దశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించామని చెప్పారు. తొలుత తాము ట్యాక్సీలపై ప్రచారం చేశామని, ఆ తర్వాత రోడ్డు పక్కన హోర్డింగులతో ప్రచారం నిర్వహించామని, ఇప్పుడు బస్సులపై ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. అయితే, ఇదంతా పాక్ వ్యతిరేక ప్రచారమని, వీరు చేస్తున్న ప్రచారంలో అన్నీ అవాస్తవాలేనని పాక్ అధికారులు అంటున్నారు.