padmavathi: 'పద్మావతి' విడుదలను ఎవరూ ఆపలేరు: దీపికా పదుకొనె
- వివాదంపై స్పందించిన దీపికా
- సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై గట్టి నమ్మకం ఉందన్న నటి
- పద్మావతి పాత్ర పోషించడం గర్వకారణం అన్న దీపికా
వివాదాల నడుమ సందిగ్ధంగా మారిన 'పద్మావతి' సినిమా విడుదల గురించి ప్రధాన పాత్ర పోషించిన నటి దీపికా పదుకొనె పెదవి విప్పింది. ఎవరు ఎంత ప్రయత్నించినా 'పద్మావతి' చిత్ర విడుదలను ఆపలేరని దీపికా పదుకొనె అంది. 'ఈ చిత్రంలో నటించినందుకు ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. పద్మావతి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి' అని దీపికా అంది.
అంత గొప్ప చిత్రాన్ని ఇలా వివాదాల పాలు చేయడం నిజంగా ఘోరమైన విషయమని ఆమె తెలిపింది. 'సినిమా విడుదల గురించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం సెన్సార్ బోర్డుకు మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ఎన్ని వివాదాలు వచ్చినా చిత్ర విడుదలను ఎవరూ ఆపలేరని నేను గట్టిగా నమ్ముతున్నాను' అని దీపికా చెప్పింది.
ఈ నవంబర్‌తో దీపికా పదుకునే బాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. తన మొదటి హిందీ సినిమా 'ఓం శాంతి ఓం', సంజయ్ లీలా భన్సాలీ తీసిన 'సావరియా' చిత్రాలు ఒకే రోజున (నవంబర్ 9) విడుదలయ్యాయి. అప్పట్లో తాను భన్సాలీ హీరోయిన్ ని అవుతానని అస్సలు ఊహించలేదని దీపికా వెల్లడించింది. అలాంటి దీపిక ఇప్పటికి సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఏకంగా మూడు సినిమాల్లో నటించేసింది. ఆయన సినిమాల్లో తాను పోషించిన పాత్రలన్నీ ఒకేలా కనిపించినా వేర్వేరు హావభావాలు, పరిస్థితులను ఎదుర్కున్నాయని పేర్కొంది.