disability: దివ్యాంగుల కోసం ఓ డేటింగ్ యాప్... భాగస్వామిని వెతుక్కోవడంలో సహాయం!
- 2016లో ప్రారంభమైన యాప్
- ఇప్పటికి 7000 మందికి జతగాళ్లను చూపించిన ఇన్‌క్లోవ్
- ఆఫ్‌లైన్ సమావేశాలు కూడా ఏర్పాటు
స్మార్ట్‌ఫోన్ల యుగంలో డేటింగ్ పార్ట్‌నర్‌ని వెతుక్కోవడానికి చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ శారీరక లోపం ఉన్నవాళ్లకు మాత్రం ఆ యాప్‌లలో రిజిస్టర్ చేసుకోవాలంటే ఏదో తెలియని సంకోచం. యాప్ ద్వారా ఒకవేళ పార్ట్‌నర్ దొరికినా తమ లోపాన్ని వారు స్వాగతిస్తారో లేదోనన్న అనుమానంతో డేటింగ్ యాప్‌లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి సమస్యను అధిగమించడానికి వారి కోసం ప్రత్యేకంగా కల్యాణి ఖోనా, శంకర్ శ్రీనివాసన్ అనే ఇద్దరు ఓ డేటింగ్ యాప్‌ను రూపొందించారు.
2016లో ప్రారంభమైన ఇన్‌క్లోవ్ అనే ఈ యాప్ ద్వారా ఇప్పటికి 7000 మందికి జతగాళ్లను చూపించారు. ఇందులో దివ్యాంగులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగదారుల కోసం ఇన్‌క్లోవ్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికి ఢిల్లీ, జైపూర్, చంఢీగడ్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ఈ ఆఫ్‌లైన్ సమావేశాలు నిర్వహించారు.