North Korea: దక్షిణకొరియా వైపు వెళ్లబోయిన ఉత్తరకొరియా సైనికుడిపై తూటాల వర్షం కురిపించిన తోటి సైనికులు!
- సరిహద్దులు దాటే ప్రయత్నం చేసిన చేసిన ఉత్తరకొరియా సైనికుడు
- వెంటనే 40 రౌండ్లు కాల్పులు జరిపిన సాటి సైనికులు
- తీవ్రంగా గాయపడిన సైనికుడ్ని ఆసుపత్రిలో చేర్చిన యునైటెడ్ నేషన్స్ కమాండ్ సిబ్బంది
ఉత్తరకొరియా నియంత నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించినా తీవ్రమైన శిక్షలు అమలవుతాయన్న సంగతి తెలిసిందే. ఆ దేశ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన నియంత పాలనలో ఎంత క్రూరమైన శిక్షలు ఉంటాయో తెలిపేందుకు నిదర్శనంగా నిలిచింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఉత్తరకొరియా సరిహద్దులోని పన్ మున్ జామ్ అనే గ్రామం అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. అయితే నిన్న పర్యాటకులు అక్కడికి పెద్దగా రాలేదు.
ఈ క్రమంలో అక్కడ గస్తీ నిర్వహించే ఆ దేశ సైనికుడు తన వాహనంలో దక్షిణకొరియా వైపు వెళ్లబోయాడు. దీనిని గమనించిన ఉత్తరకొరియా సైనికులు వెంటనే అతడిపై గుళ్ల వర్షం కురిపించారు. సుమారు 40 రౌండ్లకు పైగా తూటాలవర్షం కురిపించారు. దీంతో ఈ సరిహద్దు ప్రాంతంలో గస్తీ బాధ్యతలు నిర్వర్తించే యునైటెడ్ నేషన్స్ కమాండ్ (యూఎన్‌సీ) సిబ్బంది దీనిని గమనించి, హెలికాప్టర్ లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.