hot air: అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్... మొదటిసారి నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం
- పాల్గొననున్న 13 దేశాల ఔత్సాహికులు
- పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం
- మరెన్నో కళా ప్రదర్శనలు
ఆంధ్రప్రదేశ్‌లోని అరుకు లోయ మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కి వేదికగా నిలిచింది. మంగళవారం మొదలుకొని మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ వంటి 13 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ-ఫ్యాక్టర్, స్కైవాల్ట్జ్ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది.
సముద్ర మట్టానికి 50 వేల అడుగుల ఎత్తు వరకు హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరగలవని, కానీ ఎయిర్ ట్రాఫిక్ కారణాల దృష్ట్యా 2500 అడుగుల ఎత్తు వరకే ఎగిరేందుకు అనుమతి ఉందని ఈ-ఫ్యాక్టర్ సీఈఓ సమిత్ గార్గ్ తెలిపారు. చాలా మంది హాట్ ఎయిర్ బెలూన్లలో ఎక్కడానికి భయపడుతుంటారని, కానీ వాటిలో ప్రయాణం చాలా సురక్షితమని ఆయన అన్నారు. ఈ ఫెస్టివల్‌లో వివిధ కళా ప్రదర్శనలు, గాన కచేరీలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.