gangula bhanumathi: 'రక్త చరిత్ర' సినిమాలో మమ్మల్ని చెడుగా చూపించారు.. జరిగింది ఒకటైతే, చూపించింది మరొకటి!: మద్దెలచెరువు సూరి భార్య

  • అవాస్తవాలను తెరకెక్కించారు
  • నన్ను చంపడానికి రవి ప్రయత్నించలేదు
  • సునీత, నేను ఎప్పుడూ మాట్లాడుకోలేదు

రామ్ గోపాల్ వర్మ తీసిన 'రక్త చరిత్ర' సినిమాలో అవాస్తవాలను చూపించారని మద్దెలచెరువు సూరి భార్య భానుమతి అన్నారు. తమ గురించి నెగెటివ్ గానే చూపించారని, పాజిటివ్ గా చూపించలేదని తెలిపారు. సినిమాను చూసిన తర్వాత, 'ఏంటి ఈ సినిమా ఇలా తీశారు' అని అనుకున్నానని చెప్పారు.

టీవీ బాంబు ఘటన తమ పెళ్లి కాకముందు జరిగిందని, కానీ సినిమాలో తమ పెళ్లై, ఇంటికి వచ్చిన తర్వాత జరిగినట్టు చూపించారని భానుమతి తెలిపారు. సినిమాలోని ఎన్నో సన్నివేశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. తన భర్త ఆరోగ్యాన్ని బాగా చూసుకునేవారని... అయితే సినిమాలో చూపించినట్టుగా సిక్స్ ప్యాక్ బాడీ మాత్రం లేదని తెలిపారు.

పరిటాల రవి అనుచరులు తనను చంపాలని గన్ ను ఎయిమ్ చేస్తే, పరిటాల సునీత వారిని వారించి తనను కాపాడినట్టు సినిమాలో చూపించడం కూడా అవాస్తవమేనని చెప్పారు. వాస్తవానికి తనకు, సునీతకు మధ్య ఎలాంటి మాటలు కూడా లేవని ఆమె అన్నారు. తనను చంపడానికి రవి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. ఒక మహిళ అనే సానుభూతి తనపై రవికి ఉండవచ్చని తెలిపారు. చెన్నేకొత్తపల్లి జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ సమయంలో ఒక్కసారి మాత్రమే రవిని తాను చూశానని... జీపులో తాము వెళుతుండగా 'రవి అతనే' అంటూ తన మనిషి చెప్పాడని... అప్పుడు కూడా రవి ఫేస్ క్లియర్ గా కనపడలేదని... ఆ తర్వాత కూడా ఆయనను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

సినిమా తీయడానికి ముందు సూరిని కలిసిన వర్మ వివరాలను కనుక్కున్నారని... ఆ తర్వాత తనను కలసి మాట్లాడారని తెలిపారు. పెళ్లి తర్వాత ఏమి జరిగింది, ఎలా జరిగిందన్న విషయాలను తెలుసుకున్నారని చెప్పారు. జరిగిన విషయాలను అన్నింటినీ ఆయనకు చెప్పామని... అయితే, సినిమాలో మాత్రం వేరే రకంగా చూపించారని అన్నారు. సూరి జైలునుంచి పారిపోయి వచ్చినట్టు చూపించారని... ఆయన అలా చేయరని చెప్పారు. ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను తెలిపారు.

gangula bhanumathi
paritala ravi
paritala sunitha
raktha charitra
maddelacheruvu suri
ram gopal varma
  • Loading...

More Telugu News