diabetic: భారత్ ను కబళించేస్తున్న షుగర్ వ్యాధి.. ఏటా ఎంత మంది చనిపోతున్నారో తెలుసా?
- మన దేశంలో 6.9 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు
- ముంబైలో అత్యధికులు
- ప్రపంచ వ్యాప్తంగా చైనాది మొదటి స్థానం
మధుమేహ వ్యాధి భారతీయులను చాపకింద నీరులా కబళించేస్తోంది. వ్యాధిపై అవగాహన లేకపోవడం, సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం, ఖరీదైన వైద్యం మన దేశంలో మృత్యు ఘంటికలను మోగిస్తోంది. భారత్ లో దాదాపు 6.9 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే అనే వార్త భయభ్రాంతులకు గురి చేసేదే. వీరిలో ఏటా 3.5 లక్షల మంది మరణిస్తున్నారని రీసర్చ్ డెవలప్ మెంట్ అండ్ మాలిక్యులర్ పాథాలజీ సలహాదారు డాక్టర్ బీఆర్ దాస్ వెల్లడించారు.
మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ముంబైలో అత్యధికంగా 23.74 శాతం మందికి, బెంగళూరులో 20.74 శాతం మందికి, కోల్ కతాలో 22.07 శాతం మందికి, ఢిల్లీలో 21.86 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు ఇంటర్నేషనల్ డయాబెట్స్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, చైనాలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.