paratha: ఆ హోటల్ యజమాని ఛాలెంజ్ ను ఇంతవరకు ఒక్కరు కూడా గెలవలేకపోయారు!
- 50 నిమిషాల్లో మూడు పరోఠాలు తింటే జీవితాంతం ఫుడ్ ఫ్రీ ఆఫర్
- ఒక్కో పరోఠా పొడుగు 1 అడుగు, మందం 6 అంగుళాలు, బరువు కేజీ
- ఒక్క పరోఠా తిని చేతులెత్తేస్తున్న యువకులు
పరోఠాలంటే ఇష్టపడనిది ఎవరు? అయినప్పటికీ మూడు పరోఠాలు తింటే 'జీవితాంతం ఫుడ్ ఫ్రీ' అంటూ ఓ హోటల్ యజమాని ఇచ్చిన ఆఫర్ ను ఇంతవరకు ఒక్కరు కూడా గెలుచుకోలేకపోవడం విశేషం. దాని వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని రోహ్ తక్ బైపాస్ రోడ్డులో గల పరోఠా జంక్షన్ యజమాని తన హోటల్ లో ఏభై నిమిషాల్లో 3 పరోఠాలు తింటే జీవితాంతం ఫుడ్ ఫ్రీగా తినవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించారు.
దీనిని వినియోగించుకునేందుకు ఆహార ప్రియులు హోటల్ కు ఉత్సాహంగా వస్తుంటారు. అయితే ఒక్క పరోఠా తిని, ఇక తమవల్ల కాదని లేచి వెళ్లిపోతుంటారని ఆయన అన్నారు. ఎందుకంటే, ఆ హోటల్ లో ఈ పోటీ కోసం తయారు చేసే పరోఠా పరిమాణం 1 అడుగు పొడవు, 6 అంగుళాల మందం ఉంటుంది. ఇలాంటి మూడు పరోఠాలను మూడు కేజీల పిండితో తయారు చేస్తారు. దీంతో ఈ మూడు కేజీల పరోఠాలను 50 నిమిషాల్లో తినడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో ఈ హోటల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రచారం పొందుతోంది.