Indigo: విమానాన్ని ఢీకొట్టిన అడవి పంది.. గంటపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం!
- రన్‌వేపై విమానం టైరును ఢీకొట్టిన ముళ్లపంది
- ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన పైలట్
- గంట తర్వాత తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ చేసిన వైనం
విశాఖపట్నం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రాత్రి పది గంటల సమయంలో ఇండిగో విమానం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపైకి దూసుకొచ్చిన అడవి పంది టైరును ఢీకొట్టింది. అప్పటికి విమానం టైర్లు లోపలికి ముడుచుకోకపోవడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని గంటపాటు అక్కడే ఆకాశంలో చక్కర్లు కొట్టించి తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అనంతరం విమానానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ప్రమాదం లేదని నిర్ధారించాక విమానం హైదరాబాద్ బయలుదేరింది.
విమానం గంటపాటు విశాఖ గగనతలంపైనే తిరిగి తిరిగి.. బయలుదేరిన విమానాశ్రయంలోనే ల్యాండ్ కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. విషయం తెలిసి పెను ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానాన్ని ఢీకొట్టింది ముళ్ల పంది అని అధికారులు తెలిపారు. రన్‌వేపైకి అది ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.