anil kumar yadav: బీసీలందరూ ఏకమై చంద్రబాబుకి దమ్మును చూపించి, జగన్‌ను గెలిపించాలి: ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

- ఏడవ రోజుకు చేరుకున్న వైఎస్ జగన్ యాత్ర
- ప్రస్తుతం కడప జిల్లాలోని కానగూడురులో వైసీపీ అధినేత
- బీసీలు వైఎస్సార్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తుంది
- ఆయన పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల లాభ పడ్డారని గుర్తు తెచ్చుకోవాలి
బీసీలందరూ ఏకమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తమ దమ్మును చూపించాలని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది. ఈ రోజు కడప జిల్లాలోని కానగూడూరులో జగన్ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో బీసీలకు అండగా ఉన్న నాయకులు ఎన్‌టీఆర్, వైఎస్సార్‌లేనని వ్యాఖ్యానించారు. బీసీ విద్యార్థులు వైఎస్సార్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల లాభపడ్డారని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. బీసీలు ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తుందని, జగన్‌కి ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు బీసీలను వాడుకుంటున్నారని, వారికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. బీసీల దెబ్బను చంద్రబాబుకి చూపించాలని వ్యాఖ్యానించారు. బీసీలు చదువుకోవడం, ఎదగడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదని ఆరోపించారు.