Chandrababu: పడవ ప్రమాదంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
- ఇప్పటివరకు 20 మృతదేహాలను బయటకు తీశారు
- ప్రమాదం గురించి తెలుసుకుని మంత్రులు, అధికారులు అక్కడకు వెళ్లారు
- ఐదుగురిపై కేసులు నమోదు
- ముగ్గురు గల్లంతయ్యారు
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న సాయంత్రం ఓ పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ ఘటన జరిగిందని తెలియగానే కొందరు మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులు అక్కడకు వెళ్లారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. మండకొండల రావు, నీలం శేషగిరిరావు, శ్రీను, విజయసారథి, చిట్టి అనే ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పవిత్ర సంగమానికి వచ్చి ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో ఇంకా నలుగురు చికిత్స పొందుతున్నారని అన్నారు. 17 మంది చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. ముగ్గురు గల్లంతయ్యారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను బయటకు తీశారని చెప్పారు.