indigo airlines: పెద్దావిడకు క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్.. మళ్లీ అపకీర్తి!
- వీల్ చెయిర్ లో తీసుకెళుతుండగా కిందపడిన ప్రయాణికురాలు
- వెంటనే చికిత్సకు తీసుకెళ్లిన సిబ్బంది
- క్షమాపణలు చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన
ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుతో ఆ సంస్థ పేరుప్రతిష్ఠలు మసకబారుతున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిపై దాడి చేసిన మచ్చతొలగిపోకముందే మరో ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఒక ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది. దాని వివరాల్లోకి వెళ్తే... లక్నో విమానాశ్రయంలో ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్ చైర్లో ఇండిగో సిబ్బంది అరైవల్ హాల్ కు తీసుకెళ్తుండగా ఆమె కిందపడిపోయారు. దీనిపై క్షమాపణలు చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
‘‘నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటనపై ఊర్వశి పారిఖ్ కు క్షమాపణ తెలుపుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అమె వీల్ చైర్ ను వెహికిల్ లేన్ మీదుగా అరైవల్ హాల్ వైపు నడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడానికి తోడు అదే ప్రాంతంలోని తారురోడ్డుపై గుంతపడడం వల్ల వీల్ చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది.
దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత ఆమె కోలుకున్నారు’’ అంటూ ఇండిగో తెలిపింది. ఈ ఘటనలో మానవ తప్పిదం లేదని ఆమె తెలిపారని ఇండిగో పేర్కొంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.