hyderabad traffic: ట్రిపుల్ రైడింగ్ విషయంలో.. కీలక నిర్ణయం తీసుకోనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- ట్రిపుల్ రైడింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు
- ట్రిపుల్ రైడింగ్ చేస్తే, ముగ్గురుకీ జరిమానాలు
- నివేదికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
జంటనగరాల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు పలు నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, వీరు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత దుర్మరణం చెందుతోందనే అంచనాకు వచ్చిన పోలీస్ యంత్రాంగం... ట్రిపుల్ రైడింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది.
వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న మరో ఇద్దరిపై కూడా జరిమానాలు విధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఒక నివేదికను రూపొందిస్తున్నారు. ముగ్గురిపైనా కేసులు నమోదు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నామని... ముగ్గురికి కూడా తలా ఒక వెయ్యి రూపాయలను జరిమానా విధించాలని కోరనున్నామని రాచకొండ అదనపు డీసీపీ (ట్రాఫిక్) దివ్యచరణ్ రావు తెలిపారు.