krishna boat accident: బోటు టూరిజం అధికారులదేనా?... ప్రమాదంలో కొత్త కోణం!
- రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థ వెనుక ఏపీ టూరిజం అధికారులున్నారన్న ఆరోపణలు
- ఇద్దర్ని మాత్రమే ఎక్కించుకోగల బోట్ కు అనుమతి
- ఇందులో పలువురు టూరిజం ఉద్యోగుల పెట్టుబడులు
కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ టూరిజం శాఖాధికారులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ టూరిజం శాఖకు చెందిన ఉన్నతాధికారులే ఈ బోటింగ్ సంస్థను ప్రారంభించారని, పలువురు టూరిజం ఉద్యోగులు ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ ప్రమాదంపై ఇతర అంశాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
టూరిజం అధికారులే బోటింగ్ సంస్థ యజమానులు కావడంతో అనుమతులు లేకున్నా బోటు నడుపుతున్నారని, దీనిని టూరిజం శాఖ చూసీ చూడనట్టు వదిలేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా చీకటి పడే సమయంలో బోటు నడపకూడదన్న నిబంధనను కూడా పట్టించుకోలేదని, సరంగు (బోటు డ్రైవర్) కనీసం తన వెంట రూట్ మ్యాప్ కూడా తీసుకెళ్లలేదన్న ఆరోపణలు కూడా వున్నాయి.