padmavathi: పద్మావతి చిత్రాన్ని ఆపేయించండి.. ప్రధానికి లేఖ రాసిన మేవార్ రాజవంశస్తులు!
- మరోవివాదంలో ’పద్మావతి‘ సినిమా
- ’పద్మావతి‘ సినిమాపై స్పందించిన మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్
- చరిత్రను వక్రీకరించారని ఫిర్యాదు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ’పద్మావతి‘ సినిమాను ఆపేయాలంటూ రేగిన వివాదం ఇంతవరకూ సద్దుమణగలేదు. నిన్నమొన్నటి వరకు రాజ్ పుత్ కర్ణి సేన ఈ సినిమాపై పోరాడగా, ఇప్పుడు ఈ వివాదంలోకి ఉదయ్ పూర్ మేవార్ రాజవంశస్థులు ప్రవేశించారు.
తమ రాజపుత్రుల చరిత్రను వక్రీకరించి, రూపొందించిన ’పద్మావతి‘ సినిమా విడుదలను ఆపేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఛైర్మన్ ప్రసూన్ జోషి, సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు, అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా తదితరులకు మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ లేఖ రాశారు. రాజపుత్రుల చరిత్రను ఈ సినిమాలో పూర్తిగా వక్రీకరించారని ఆయన ఆరోపించారు.
హిందువుల చరిత్రతో పాటు భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని, అందువల్ల ఈ సినిమాను నిలిపివేయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. రాణీ పద్మావతిపై పరిశోధన చేసి ఈ సినిమా రూపొందించానంటున్న భన్సాలీ ఇంతవరకు తమను సంప్రదించలేదని వారు అందులో పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించే ఇటువంటి చిత్రాలతో జాతికి ప్రమాదమని ఆయన లేఖలో తెలిపారు.