Jammu and Kashmir: 'పీవోకే పాకిస్థాన్ దే'నని సంచలన వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్ అబ్దుల్లా!
- భారత్ కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేసిన ఫరూఖ్
- పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్ దే
- మూడు న్యూక్లియర్ శక్తుల మధ్య కశ్మీర్ ఉంది
- భారత్ కశ్మీర్ ప్రజలను దగా చేసింది
జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్ కు అనుకూలంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్థాన్ కే చెందుతుందని అన్నారు. పాకిస్థాన్-భారత్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో ఏమాత్రం మార్పు ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
మూడు న్యూక్లియర్ శక్తులైన చైనా, పాకిస్థాన్, భారత్ మధ్య కశ్మీరు లోయ ఉన్నందున స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకోవడం కూడా తప్పేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమతో భారత్ లో కలవాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పిన ఆయన, భారతదేశం కశ్మీరు ప్రజలను దగా చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.