air asia: పోలీసులకు యువతి ఫిర్యాదు.. ఎయిర్‌ఏషియా పైలెట్ సహా ఇద్దరు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు
- యువతిపై ఎయిర్‌ఏషియా సిబ్బంది వేధింపులు
- నిబంధనలు ఉల్లంఘించనప్పటికీ వేధించారని ఆరోపణలు
- విమానం ల్యాండ్ అయ్యాక కూడా క్షమాపణలు చెప్పమన్నారన్న బాధితురాలు
- రాంచీ నుంచి బెంగళూర్‌కు వెళ్లిన విమానంలో ఘటన
ఓ ప్రయాణికురాలిపై ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పైలెట్ సహా ఇద్దరు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 3న తాను రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్ ఏషియా విమానంలో ప్రయాణించానని బాధిత యువతి చెప్పింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమని సిబ్బంది చెప్పడంతో తాను చేశానని తెలిపింది.
అయినప్పటికీ పైలెట్‌తో పాటు ఇద్దరు సిబ్బంది తనను తిట్టారని ఆరోపించింది. తనను విమానం నుంచి దించేస్తామని కూడా బెదిరించారని పేర్కొంది. బెంగళూర్‌లో ఆ విమానం ల్యాండ్ కాగా ప్రయాణికులందరినీ పంపించి, తనను మాత్రం అడ్డుకున్నారని చెప్పింది. పైలెట్‌కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని బెదిరించారని వివరించింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, లేదంటే బయట పట్టుకుని సంగతి తేలుస్తామని అన్నారని పేర్కొంది.
అనంతరం తాను అక్కడి నుంచి వెళ్లి తన స్నేహితురాలి సాయంతో ఎయిర్‌ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్‌ఏషియా స్పందించాల్సి ఉంది. ఎయిర్‌ఏషియా ఇటీవల అనేక వివాదాల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.