twitter: ట్విట్టర్‌లో కొత్తగా వెరిఫికేషన్ చెక్ మార్కు పొందాలనుకునే వారు కొన్నాళ్లు ఆగాల్సిందే!
- సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ ఖాతాలు
- కీలక వ్యక్తులకు మాత్రమే వెరిఫికేషన్ చెక్‌మార్క్ ఇస్తారని నెటిజన్ల భావన
- శ్వేతజాతీయుల ఆధిపత్య ర్యాలీకి నేతృత్వం వహించిన వ్యక్తికి కూడా చెక్‌మార్క్
- నెటిజన్ల విమర్శలు.. ఆలోచనలో పడ్డ ట్విట్టర్
సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ ఖాతాలు ఉంటాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వెరిఫైడ్ ఖాతాలు ఉపయోగిస్తుంటారు. తమ ఖాతా వెరిఫికేషన్ కోసం ట్విట్టర్‌ను కోరతారు. ఖాతా ఆ వ్యక్తిదే అని ధ్రువీకరించిన తరువాత ట్విట్టర్ ప్రతినిధులు చెక్‌మార్క్ ఇస్తారు. అయితే కొన్ని రోజులు వెరిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. దీనికి పెద్ద కారణమే ఉంది. ఆ మార్క్ కోసం సెలబ్రిటీలే కాకుండా ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇటీవల వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో జాసన్ కెస్లర్ అనే వ్యక్తి నేతృత్వంలో శ్వేతజాతీయుల ఆధిపత్య ర్యాలీ జరిగింది. ట్విట్టర్‌లో అతడి పేరు పక్కన వెరిఫైడ్ చెక్ మార్క్ ఉంది. ఇటువంటి వ్యక్తికి ధ్రువీకరణ ఇవ్వడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఈ విషయంపై ట్విట్టర్ ప్రతినిధులు దీర్ఘాలోచనలో పడ్డారు. వెరిఫికేషన్ మార్క్‌ను ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారనే భావన నెటిజన్లలో ఉందని, ఈ విషయమై అందరిలోనూ అయోమయం ఉందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం వెరిఫికేషన్‌ను నిలిపివేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. దీంతో కొత్తగా వెరిఫికేషన్ మార్కు పొందాలనుకునే వారు కొన్నాళ్లు ఆగాల్సిందే.