YSRCP: జగన్‌పైకి సీబీఐ కుక్కలను వదిలింది సోనియానే.. భూమన సంచలన వ్యాఖ్యలు
- జగన్ ఎదుగుదలను సోనియాగాంధీ ఓర్వలేకపోయారు
- ఏ తప్పూ చేయకున్నా కక్షగట్టి జైలుకు పంపారు
- అశోక్ నీతిమంతుడైతే ప్రమాణం చేయాలి: బొత్స
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎదుగుదలను ఓర్వలేక సోనియాగాంధీ అప్పట్లో సీబీఐ రాకాసి కుక్కలను జగన్‌పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. విజయనగరంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో భూమన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏ తప్పూ చేయకపోయినా, తన మాట వినలేదన్న అక్కసుతోనే సోనియా కక్షగట్టి జైలుకు పంపారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసి 67 స్థానాలను గెలుచుకున్నామని, ఈసారి అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
తానెంతో నీతిమంతుడినని చెప్పుకుంటున్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆ విషయాన్ని పైడితల్లి అమ్మవారిపై ప్రమాణం చేసి గంటస్తంభం వద్ద చెప్పాలని మరోనేత బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. భోగాపురం విమానాశ్రయ పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విమానాశ్రయ నిర్మాణ పనుల్లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు కుమ్మక్కయ్యారని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు దోచిపెట్టి కమీషన్ల కోసం వెంపర్లాడుతున్నారని బొత్స ఆరోపించారు.