karthi: దానం చెయ్యడంలో విశేషం ఏముంది... దేవుడు నాకు ఎక్కువే ఇచ్చాడు కదా?: కార్తీ
- దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు
- ఇబ్బందుల్లో ఉన్నప్పుడే సాయం చెయ్యాలి
- ఇబ్బందుల్లో ఉన్నవారే సాయం కోరుతారు
- నాన్న అడుగు జాడల్లో నడుస్తున్నా
'అవసరంలో ఉన్న వారికి సాయం చెయ్యడంలో విశేషమేముంది? దేవుడు మనకి వారికంటే ఎక్కువే ఇచ్చాడు కదా?' అంటున్నాడు సినీ నటుడు కార్తీ. దీవించాల్సిన దానికంటే దేవుడు మనల్ని అధికంగానే దీవించినప్పుడు... ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకునేందుకు ఉన్న సమస్య ఏంటని అడిగాడు. మొదట్లో తానిలా ఉండేవాడిని కాదని, తన తండ్రిని చూసి అలా తయారయ్యానని చెప్పాడు. తన తండ్రి దగ్గరకు ఎవరైనా పేదవారు డబ్బులు కావాలని వస్తే.. వంద కావాలంటే రెండు వందలు ఇచ్చేవారని, నాలుగు వందలు అడిగితే ఐదు వందలు ఇచ్చేవారని చెప్పాడు.
'ఎందుకు నాన్నా, అలా ఎక్కువ ఇస్తారు?' అని అడిగితే.. 'దేవుడు మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఆ వంద అదనంగా ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి మరికొంచెం ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండాలనే కదా మనం ఆ డబ్బులిచ్చాం.. మంచి వాడైతే ఆ డబ్బు మంచిపనికి వాడుతాడు. చెడ్డవాడైతే ఆ డబ్బుతో తాగుతాడు. ఏం చేసినా ఆనందిస్తాడు. మనకి కావాల్సింది అదే కదా?' అని చెప్పారని... ఆయన చెప్పినట్టే తనకు చేతనైనంత సాయం సమాజానికి చేస్తుంటానని అన్నాడు. తన భార్య తనకంటే మంచిదని, తనకంటే మంచి చేయాలని చూస్తుందని, తనకు అభ్యంతరం చెప్పదని కార్తీ తెలిపాడు.