preeti patel: రహస్య భేటీల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరై, బ్రిటన్ భారత సంతతి మహిళా మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా
- థెరిసా మే మంత్రివర్గంలో కీలక నేత ప్రీతి పటేల్
- ఎవరికీ చెప్పకుండా ఇజ్రాయెల్ లో పర్యటన
- ఆరోపణలు రావడంతో రాజీనామా
సెలవులను గడిపే నెపంతో ఇజ్రాయెల్ కు వెళ్లి, దౌత్యపరమైన నిబంధనలను పక్కనబెట్టి, అక్కడ రహస్యంగా భేటీలు జరిపినట్టు వచ్చిన ఆరోపణలపై బ్రిటన్ మంత్రి, భారత సంతతి మహిళా నేత, అధికార పార్టీలో బ్రెగ్జిట్ కు అనుకూలంగా గళమెత్తి, ఆపై థెరిస్సా మే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని థెరిసా మే నుంచి తాఖీదులు వెళ్లిన తరువాత ఆమె రాజీనామా లేఖను సమర్పించగా, దాన్ని ప్రధాని కార్యాలయం బహిర్గతం చేసింది.
ప్రధాని థేరిసాకు, విదేశాంగ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా గత ఆగస్టులో ప్రీతి, ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఈ వ్యవహారంపై పెను దుమారం చెలరేగింది. రాజీనామా అనంతరం ప్రీతి స్పందిస్తూ, మంత్రిగా తనపై కొన్ని బాధ్యతలున్నాయని, ఏం చేసినా, పారదర్శకతతో వ్యవహరించానని తెలిపారు. తన తప్పుకు ప్రధానికి, ప్రభుత్వానికి క్షమాపణ చెబుతున్నానని, ఇజ్రాయెల్ అధికారులతో తాను ఎలాంటి రహస్య మంతనాలు జరపలేదని తెలిపారు. ఇక ప్రీతి ఓ మంచి నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వంపై ప్రజల్లో పారదర్శకత, నమ్మకం మరింతగా పెరిగాయని థెరిస్సా మే వ్యాఖ్యానించారు.