KTR: ఏ ఉక్కూ లేని విశాఖలోనే స్టీల్ ప్లాంట్ పెట్టారు: కేటీఆర్

  • స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడే ముడిసరుకు ఉండాల్సిన అవసరం లేదు
  • బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నిస్తున్నాం
  • ప్రత్యేక రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు పంపాం

బయ్యారంలో ఉన్న ఐరన్ ఓర్ కు అవసరమైన పరిమాణం, తగినంత నాణ్యత లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సెయిల్ ద్వారా సమీకృత స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏ ఉక్కూ లేని విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారని... అలాంటిది, ఏదో ఒక క్వాలిటీ ఉన్న బయ్యారంలో ప్లాంట్ పెడితే తప్పేముందని అన్నారు. బయ్యారానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ తెలిపారు.

విశాఖలో ఉక్కు లేకపోయినప్పటికీ... అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిందని కేటీఆర్ అన్నారు. చత్తీస్ ఘడ్ లోని బైలడిల్ల నుంచి ఒక రైల్వే లింకేజీని ఏర్పాటు చేసి, 500 కి.మీ. దూరం నుంచి విశాఖకు ఐరన్ ఓర్ ను తరలించడం జరిగిందని చెప్పారు. ఇవాళ 6 మెట్రిక్ మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉందని చెప్పారు.

ఏ ప్రాంతంలోనైనా స్టీల్ ప్లాంట్ ను నెలకొల్పాలంటే... అక్కడే ముడిసరుకు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా కేటీఆర్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. 

  • Loading...

More Telugu News