rafia naaz: రాందేవ్ బాబా శిష్యురాలికి ఫత్వా జారీచేసిన ముస్లిం సంస్థలు!
- యోగా శిక్షణ ఆపాలంటూ ఫత్వా
- ఆపకపోతే ప్రాణహాని తప్పదంటూ హెచ్చరిక
- రఫియాకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా శిష్యురాలు రఫియా నాజ్ కు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. యోగా శిక్షణ ఇవ్వడాన్ని వెంటనే ఆపాలని, లేకపోతే ప్రాణహాని తప్పదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, రఫియాకు జార్ఖండ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. ఈ హెచ్చరికలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ స్పందిస్తూ, రఫియాకు ఎలాంటి ఆపద కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రాంచీ ఎస్పీ కుల్దీప్ ద్వివేదీ మాట్లాడుతూ, రఫియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రామ్ దేవ్ బాబాతో కలసి రఫియా పలు సందర్భాల్లో వేదికను పంచుకున్నారు. బాబాతోపాటు ఆమె కూడా యోగా మెళకువలు నేర్పేవారు.