Hyderabad: ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న అమీర్ పేట్ మెట్రో రైల్వే స్టేషన్!
- 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెట్రో స్టేషన్
- మూడు అంతస్తుల్లో స్టేషన్.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్
- రోజూ 30,000 మంది ప్రయాణంచే వెసులుబాటు
- స్కైవేలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, మెట్లు.. బోలెడు!
హైదరాబాదు వ్యాప్తంగా మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో రాజధానిలో కొన్ని మెట్రో స్టేషన్లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నాయి. వాటిల్లో అమీర్ పేట్ మెట్రో రైల్వే స్టేషన్ ప్రత్యేకమైనది. ఈ రైల్వే స్టేషన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
దీనిని ఇంటర్ చేంజ్ మెట్రో రైల్వే స్టేషన్ అంటారు. ఇది మూడు అంతస్తుల్లో నిర్మితమైంది. తొలి అంతస్తులో టికెటింగ్, ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ ఉండగా, రెండో అంతస్తులో ఒక వైపు నుంచి వచ్చే రైళ్లు ఆగుతాయి. మరొకవైపు నుంచి వచ్చే రైళ్లు మూడో అంతస్తులో ఆగుతాయి. ఇక్కడే ప్రయాణికులు రైళ్లు మారాల్సి ఉంటుంది.
ప్రతి మెట్రో రైల్వే స్టేషన్ లో రైలు 20 సెకెన్లపాటు ఆగితే అమీర్ పేట్ లో మాత్రం ఒక్కోరైలు రెండు నిమిషాలు ఆగుతుంది. ఈ రైల్వే స్టేషన్ లో ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. పొడవు 476 అడుగులు. కాగా, వెడల్పు 148 అడుగులు. భూమి నుంచి స్టేషన్ పైకప్పు ఎత్తు 112 అడుగులు.
ఈ స్టేషన్ నుంచి రోజూ 30 వేల మంది ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేయొచ్చు. ఈ స్టేషన్ లో ఒకేసారి 6,000 మంది ఉండవచ్చు. మెట్రో స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణికుడు మాత్రమే నేరుగా రెండు, మూడు అంతస్తులకు వెళ్లగలడు. అలా కాకుండా రెండో అంతస్తు టికెట్ తీసుకుని మూడో అంతస్తులో అడుగుపెట్టలేడు. మూడో అంతస్తులో అడుగు పెట్టాలంటే మళ్లీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్టేషన్ లో ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉంటాయి. ఈ స్టేషన్ కు పాదచారులు, సర్వీస్ లేన్స్, బస్సు, ఆటోల కోసం ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ఇక్కడికి దగ్గర్లో ఉండే సంజీవరెడ్డినగర్, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, గ్రీన్ లాండ్స్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్, స్కైవేలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్లాట్ ఫామ్ పై దిగిన ప్రయాణికుడు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా బయటకు వెళ్లే మార్గం, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఎల్‌ఈడీ డిస్ ప్లే విధానంలో ప్రదర్శిస్తారు.