demonitisation: మోదీ ఆలోచనా రాహిత్యంతో ధ్వంసమైన జీవితాలు: నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
- ఎన్నో ఇబ్బందులు పడిన పేదలు
- బ్లాక్ డే పాటిస్తున్న విపక్షాలు
- పండగ చేసుకుంటున్న ఎన్డీయే
ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా రాహిత్యంతో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా పేద భారతీయుల జీవితాలు ధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. స్వతంత్ర భారతావనిలో నోట్ల రద్దు ఓ విషాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. నోట్ల రద్దు తరువాత పేదలు ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
కాగా, నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ నేడు 'బ్లాక్ డే'ను విపక్షాలు పాటిస్తుండగా, అధికార ఎన్డీయే మాత్రం 'యాంటీ బ్లాక్ మనీ డే' అంటూ ఉత్సవాలు జరుపుకుంటోంది. బీజేపీ ఏం ఘనకార్యం చేసిందని వేడుకలు జరుపుకుంటోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. నోట్ల రద్దు భారతజాతిని మోసం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించగా, ఇదో అతిపెద్ద స్కామ్ అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇది నల్లధనంపై పోరాటం కాదని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు అధికారపక్షం ఆడిన నాటకమని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సైతం నోట్ల రద్దుతో దేశానికి ఒనగూరిందేమీ లేదని విమర్శించారు.