Vodafone: ఎయిర్‌టెల్‌ను ఫాలో అవుతున్న వొడాఫోన్.. డేటా రోల్ ఓవర్ ఆఫర్ ప్రకటన!

  • ఎయిర్‌టెల్‌కు పోటీగా డేటా రోల్ ఓవర్ ఆఫర్
  • ఎంపిక చేసిన సర్కిళ్లలోనే.. 
  • ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో అందుబాటులో లేని ప్లాన్

ప్రైవేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ డేటా క్యారీయింగ్ ఆఫర్‌ను ప్రకటించిన కొన్ని గంటలకే వొడాఫోన్ కూడా అదే బాట పట్టింది. డేటా రోల్ ఓవర్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రెడ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమేనట. ఈ మేరకు కొత్త ప్లాన్లను ప్రకటించిన వొడాఫోన్ వాటిని రెడ్ ట్రావెలర్, రెడ్ ఇంటర్నేషనల్, రెడ్ సిగ్నేచర్ ప్లాన్లుగా విడగొట్టింది.

వొడాఫోన్ రెడ్ ప్లాన్లలో నేషనల్ రోమింగ్‌ ఉచితం. అలాగే వొడాఫోన్ ప్లే ద్వారా సినిమాలు, లైవ్ టీవీని ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా మ్యాగజైన్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీనికి అదనంగా రెడ్ షీల్డ్ థెఫ్ట్ ప్రొటెక్షన్, 200 జీబీల వరకు మిగిలిపోయిన డేటాను పోగుచేసుకుని వాడుకునే సదుపాయం (డేటా క్యారీయింగ్) కూడా కల్పిస్తున్నట్టు వివరించింది. నేటి (బుధవారం) నుంచే ఇది అమల్లోకి రానుంది. అయితే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని వినియోగదారులకు ఇది వర్తించదు.

వొడాఫోన్ రెడ్ ట్రావెలర్ ఆర్ ప్లాన్‌లో రూ.499 రెంటల్‌పై వినియోగదారులు 20 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ప్లాన్ ఎంలో రూ.699 రెంటల్‌పై 35 జీబీ డేటా, ప్లాన్ ఎల్‌లో రూ.999 రెంటల్‌పై 50 జీబీ డేటాతోపాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

వొడాఫోన్ రెడ్ ఇంటర్నేషనల్ ఆర్ ప్లాన్‌లో రూ.1299 రెంటల్‌పై 75 జీబీ డేటా 100 ఎస్సెమ్మెస్‌లు, వంద ఐఎస్‌డీ కాల్స్ నిమిషాలు లభిస్తాయి. ఎం ప్లాన్‌లో రూ.1699పై 100 జీబీ డేటా, ఎల్ ప్లాన్‌లో రూ.1999పై 300 ఉచిత ఐఎస్‌డీ కాల్స్, 125 జీబీ డేటా లభిస్తాయి. రెడ్ సిగ్నేచర్ ప్లాన్‌లో వినియోగదారులు 200 ఉచిత ఐఎస్‌డీ నిమిషాలు, 200 జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ల కాలపరిమితి నెల రోజులు.

Vodafone
Airtel
Data Roll Over
  • Loading...

More Telugu News