ys jagan: అల్పాహారం తీసుకుని పొద్దున్నే పాదయాత్రకు కదిలిన వైఎస్ జగన్... నేటి షెడ్యూల్ ఇది!
- మిత అల్పాహారం తరువాత మొదలైన యాత్ర
- మరికాసేపట్లో వైఎస్ విగ్రహానికి పూలమాల
- గాలేరు - నగరి కాలువ పరిశీలన
- రాత్రికి తిమ్మాయపల్లి వద్ద బస
వైకాపా అధినేత వైఎస్ జగన్, తన రెండో రోజు పాదయాత్రను ఈ ఉదయం వేంపల్లి శివార్ల నుంచి ప్రారంభించారు. అంతకుముందు ఉదయం జగన్, మిత అల్పాహారం తీసుకున్నారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. అరగంట నడక తరువాత, ఓ పెట్రోలు బంకు వద్ద ప్రజలు జగన్ పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మరికాసేపట్లో వేంపల్లె క్రాస్ రోడ్స్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించనున్నారు.
ఆపై 11 గంటల తరువాత ప్రజలతో ముఖాముఖి, 11.30కి ఆలయంలో పూజలు చేసి, వైఎస్ఆర్ కాలనీ వైపు జగన్ నడుస్తారు. అక్కడ 12 గంటలకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆపై కడప - పులివెందుల మార్గంలో మధ్యాహ్న భోజన విరామం నిమిత్తం ఆగుతారు. తిరిగి 3.30 గంటలకు నడకను ప్రారంభించి, సర్వరాజుపేట మీదుగా గాలేరు - నగరి కాలువ వద్దకు వెళ్లి, కాలువను పరిశీలించి, రాత్రి 8.30కి ప్రొద్దుటూరు రోడ్డులోని తిమ్మాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బసకు జగన్ చేరుకుని విశ్రమిస్తారు.