rahul gandhi: మోదీజీ! సెల్ఫీల మోజు వదలండి... దాని వల్ల చైనాకి లాభం: రాహుల్ గాంధీ
- ప్రధానిపై రాహుల్ విమర్శలు
- చైనా ఉపాధి రంగంతో భారత ఉపాధి రంగానికి పోలిక
- చైనా ఉపాధి అవకాశాలతో భారత నిరుద్యోగాన్ని పోల్చిన రాహుల్ గాంధీ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సెల్ఫీల పట్ల మోజు వదలాలని సూచించారు. ప్రధాని సెల్ఫీల మోజు వల్ల యువత ఆకర్షితులై స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారని, దీని వల్ల చైనా లాభపడుతోందని ఆయన మండిపడ్డారు. ఆయన తీసుకునే సెల్ఫీల వల్ల భారత యువతకు ఎలాంటి లాభం లేదని ఆయన చెప్పారు.
తయారీ రంగంతో చైనా అక్కడి యువతకు ఉపాధి కల్పిస్తుంటే, భారత ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి కూర్చుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. చైనా ప్రతి 24 గంటలకు 50,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా, భారత్ లో మాత్రం ప్రతి 24 గంటల్లో కేవలం 450 మందికి మాత్రమే ఉపాధి లభిస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా సభలో పాల్గొన్న వారి ఫోన్లు భారత్ లో తయారవుతున్నవా? లేక చైనావా? అని సభికులనుద్దేశించి అడిగారు. ఆ ఫోన్ బటన్ ఒత్తిన ప్రతిసారి ఒక చైనీయుడికి ఉపాధి లభిస్తోందని ఆయన మండిపడ్డారు.