liquor sales: మద్యం విక్రయాలు పెరగాలంటే మహిళల పేర్లు పెట్టాలన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మహారాష్ట్ర మంత్రి
- క్షమించాలని వేడుకున్న మంత్రి గిరీష్ మహజన్
- మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని వ్యాఖ్య
- ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చించానన్న మంత్రి
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మద్యం విక్రయాలు బాగా పెరగాలంటే, వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలంటూ సలహా ఇచ్చిన మహారాష్ట్ర నీటి వనరుల మంత్రి గిరీష్ మహజన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. 'మహారాజా' పేరుతో మద్యం విక్రయాలు చేపడుతున్న ఆ వ్యాపారికి 'మహారాణి' అనే పేరు మార్చితే అమ్మకాలు బాగుంటాయని, పొగాకు ఉత్పత్తులు బాగా అమ్ముడు పోవడానికి కారణం మహిళల పేర్లు పెట్టడమేనని మంత్రి గిరీష్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై చాలా మంది మహిళా సంఘాల నేతలు, సామాజిక వాదులు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన మంత్రి ఈ వివాదంపై స్పందిస్తూ... 'నా వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు అడుగుతున్నాను. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు' అన్నారు. ఈ విషయం గురించి తాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.