Venkaiah Naidu: కాన్వెంట్ చదువుతో ఉపరాష్ట్రపతి కాలేదు.. కష్టపడి ఈ స్థాయికి వచ్చా: వెంకయ్య
- నన్నయ వర్సిటీలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన
- విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి
- కాన్వెంట్ చదువులు చదివితేనే గొప్పవారిమి అవుతామని అనుకోవద్దు
- మార్కుల కోసం కాకుండా, వ్యక్తిత్వంలో మార్పు కోసం చదవాలి
తాను కాన్వెంట్ చదువుతో ఉపరాష్ట్రపతి కాలేదని, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విద్య అనేది వ్యక్తిత్వంలో మార్పుతీసుకువస్తుందని అన్నారు. కాన్వెంట్ చదువులు చదివితేనే గొప్పవారిమి అవుతామని అనుకోవద్దని చెప్పారు.
మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని వెంకయ్య నాయుడు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని, మార్కుల కోసం కాకుండా, వ్యక్తిత్వంలో మార్పు కోసం చదవాలని సూచించారు. విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలని, మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని చెప్పారు.