BJP: మద్యం విక్రయాలు బాగా జరగాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలి: బీజేపీ మంత్రి గిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మద్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఓవైపు మహిళల ఆందోళన
- మరోవైపు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు
- పొగాకు ఉత్పత్తులకు బాగా గిరాకీ రావడానికి కారణం వాటికి మహిళల పేర్లు పెట్టడమే
మద్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఓపక్క మహిళలు ఆందోళన చెందుతుంటే, మరోవైపు మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి నిన్న ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వ్యాపారికి షుగర్ ఫ్యాక్టరీనే కాకుండా మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. వైన్ షాపులకు ఆయన ‘మహారాజా’ అని పేరు పెట్టుకుంటారు. ఆ వ్యాపారి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గిరీష్ మాట్లాడుతూ... మద్యం విక్రయాలకు గిరాకీ బాగా రావాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని ఉచిత సలహా పారేశారు.
చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారని, పొగాకు ఉత్పత్తులు అంతగా అమ్ముడు పోవడానికి వాటికి మహిళల పేర్లు పెట్టడమే కారణమని మంత్రి గిరీష్ అన్నారు. కనుక మద్యం షాపులకు ‘మహారాజా’కి బదులు ‘మహారాణి’ అని పేరు మార్చాలని చెప్పారు.