aadhaar: జనవరి 31 నుంచి రైల్వే ఉద్యోగులకు ఆధార్ ఆధారిత హాజరు
- స్పష్టం చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ
- కోల్కతా మెట్రో రైలు కార్యాలయాల్లో మొదట ప్రయోగం
- ఆలస్యంగా వచ్చేవారికి చెక్ పెట్టే ప్రయత్నం
ఆలస్యంగా వచ్చే రైల్వే ఉద్యోగులపై కొరడా ఝుళిపించే యోచనలో జనవరి 31 నుంచి ఆధార్ ఆధారిత హాజరు పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు, డివిజన్లకు ఆదేశాలు జారీచేస్తూ లేఖ పంపించింది. బయోమెట్రిక్ ద్వారా హాజరును నమోదు చేసే ఈ ప్రక్రియను మొదట కోల్కతా మెట్రో రైలు పరిధిలోని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లకు విస్తరించనున్నారు.
ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు, అసలు ఉద్యోగానికే హాజరవని ఉద్యోగులకు చెక్ పెట్టేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ పద్ధతి హాజరు విధానం కొన్ని ముఖ్య రైల్వే కార్యాలయాల్లో అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.