ND Tiwari: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ పరిస్థితి విషమం!
- గతనెలలో ఆసుపత్రిలో చేరిన తివారీ
- రక్తపోటు పడిపోయి, పరిస్థితి క్షీణించిందన్న వైద్యులు
- 24 గంటలూ పర్యవేక్షిస్తున్న వైద్య బృందం
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ (92) పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గత నెలలో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన తివారీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
తీవ్ర జ్వరం, న్యూమోనియాతో బాధపడుతున్న తివారీని అక్టోబరు 26న ఇక్కడి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఆయన ఉన్నారు. తివారీ రక్తపోటు పడిపోయిందని, ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తివారీని వైద్య బృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. సెప్టెంబరులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనప్పటి నుంచి తివారీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా తివారీ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గానూ తివారీ సేవలందించారు.