Kiwis: చేతులెత్తేసిన భారత్.. రెండో టీ20 కివీస్‌దే!
- బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా
- సిరీస్ 1-1తో సమం
- ఉత్కంఠగా మారనున్న మూడో టీ20
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన రెండో టీ20లో మున్రో వీరబాదుడు ముందు భారత్ తేలిపోయింది. రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో సిరీస్ ఫలితం తిరువనంతపురానికి షిష్ట్ అయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రోలు వీరవిహారం చేశారు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరి జోడీని విడదీసేందుకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.
తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించిన తర్వాత చాహల్ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి గుప్టిల్ ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అయితే గుప్టిల్ ఔటైన ఆనందం భారత శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మున్రో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు బాది టీ20లో రెండో శతకాన్ని నమోదు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ కానె విలియమ్సన్ (12), టామ్ బ్రూస్ (నాటౌట్) 18 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్, కొత్త కుర్రాడు సిరాజ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధవన్ (1), 11 పరుగుల వద్ద మరో ఓపెనర్ రోహిత్‌శర్మ (5) ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (23) 21 బంతుల్లో 4 ఫోర్లు బాది ఊపుమీద ఉన్నట్టు కనిపించినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ చెలరేగి ఆడాడు. దీంతో భారత శిబిరంలో గెలపుపై ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేసిన కోహ్లీ సాంట్నర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో గెలుపు ఆశలు అడుగంటి పోయాయి. ధోనీ 49 (2X4, 3X6) దాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. హార్ధిక్ పాండ్యా (1), అక్సర్ పటేల్ (5), భువనేశ్వర్ కుమార్ (2, నాటౌట్), జస్ప్రిత్ బుమ్రా (1, నాటౌట్)లు కూడా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేయగా, మిచెల్ సాంట్నర్, సోధీ, కోలిన్ మున్రో చెరో వికెట్ తీశారు. కోలిన్ మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.