nellore: నెల్లూరు జిల్లాలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం... ప్రజల ఆందోళన!
- తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం
- చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
- తమిళనాడులో కురుస్తున్న వర్షాలు
- నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు
నెల్లూరు జిల్లాలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన తుపాను తీరం దాటుతున్న వేళ, ఏర్పడిన అలల ధాటికి, సముద్రం పలు ప్రాంతాల్లో 300 మీటర్ల నుంచి కిలోమీటరు దూరం వరకూ ముందుకు వచ్చింది. దీంతో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాల కారణంగానే సముద్రం ముందుకు వచ్చిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, స్నానాలకు కూడా ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.
కాగా, ఈ ఉదయం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోను ఓ మోస్తరు నుంచి భారీ వర్గాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఉదయం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుసగా ఐదో రోజూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సోమవారం నాటికి వరద తగ్గి, రోడ్లపై నిలిచిన నీరంతా సముద్రంలోకి వెళితేనే పాఠశాలలు తిరిగి తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది.