aadhar: ఆధార్ కార్డుతో ఇకపై 12 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు!
- బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసిన ఐఆర్ సీటీసీ
- లాగిన్ అయి, ఆధార్ అప్ డేట్ చేసుకుంటే చాలు
- వెల్లడించిన ఐఆర్ సీటీసీ అధికారులు
మీకు ఆధార్ కార్డు ఉందా? దాన్ని రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్ సీటీసీతో అనుసంధానం చేసుకున్నారా? అయితే, మీరు ఇకపై నెలకు 12 రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక ఐడీపై నెలకు 6 టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే వీలుందన్న సంగతి తెలిసిందే. ఇక ఆధార్ ను అనుసంధానం చేసుకుని, కేవైసీ సమర్పిస్తే టికెట్లు తీసుకునే పరిమితిని 12కు పెంచుకోవచ్చు. ఐఆర్ సీటీసీ పోర్టల్ ద్వారా తొలుత ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఆ కోటా పూర్తయితే, మరో ఆరు టికెట్లను ఆధార్ అనుసంధానంతో పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇందుకోసం పోర్టల్లో లాగిన్ అయి, మై ప్రొఫైల్ ను క్లిక్ చేసి, కేవైసీపై క్లిక్ చేయాలని, ఆపై ఆధార్ నంబర్ ను అప్ డేట్ చేస్తే సరిపోతుందని తెలిపారు. కాగా, దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న వారు ఎప్పటిలోగా, తమ మొబైల్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలన్న విషయమై ఆయా బ్యాంకులు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కస్టమర్లకు అందిస్తుండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.