team India: రాజ్ కోట్ వేదికగా నేడే కీలకమైన రెండో టీ20!
- సిరీస్ లక్ష్యంగా భారత్
- మ్యాచ్ గెలవాలని కివీస్
- బలంగా ఉన్న టీమిండియా
- బలహీనతలు అధిగమిస్తామంటున్న కివీస్
గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా, ఈ సిరీస్ ను గెలుచుకుని పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది.
ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో విజయం కీలకం కానుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు అద్భుతమైన శుభారంభం ఇవ్వడంతో అదే జట్టు బరిలోకి దిగనుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన ఆశిష్ నెహ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. బౌలర్ కావాలనుకుంటే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అలా కాకుండా బ్యాట్స్ మన్ కావాలనుకుంటే దినేష్ కార్తీక్ లేదా మనీష్ పాండేలలో ఎవరో ఒకర్ని జట్టులోకి తీసుకోవచ్చు. టీమిండియా అద్భుతమైన ఫాంలో ఉండగా, ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తున్నారు. కివీస్ ది పూర్తి భిన్నమైన పరిస్థితి, స్టార్ బ్యాట్స్ మన్ మార్టిన్ గుప్టిల్ పూర్తిగా విఫలమయ్యాడు. మున్రో కూడా పెద్దగా రాణించింది లేదు. విలియమ్సన్ కూడా విఫలమయ్యాడు. రాస్ టేలర్ కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. కివీస్ బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉంది. కేవలం బ్యాటింగ్ విభాగంగా మాత్రమే తేలిపోతోంది. దీంతో ఈ మ్యాచ్ తో సత్తా చాటాలని టాప్ ఆర్డర్ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తిగా మారింది.