INSTAGRAM: వీడు సామాన్యుడు కాదు.. ఐఫోన్ కోసం నిల్చున్న ప్లేస్‌ను రూ.30 వేలకు అమ్మేసిన ఘనుడు!

  • యువకుడి వినూత్న ఐడియా
  • క్యూలోని ప్లేస్‌ను సోషల్  మీడియా ద్వారా అమ్మేసిన వైనం
  • పిచ్చిపిచ్చిగా వైరల్ అయిన పోస్ట్

ఐఫోన్.. ప్రపంచంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫోన్ రిలీజవుతోందంటే చాలు, దానిని తొలుత తామే దక్కించుకునేందుకు పోటీ పడే యువత ఎందరో. నిద్రాహారాలు మాని రోజుల తరబడి ఐఫోన్ స్టోర్ల ముందు నిలబడిన వారూ ఉన్నారు. తాజాగా ఐఫోన్-10 రిలీజ్ అవుతుండడంతో మామూలుగానే స్టోర్ల ముందు క్యూలు వెలిశాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ స్టోర్ ముందు కూడా ఇదే దృశ్యం కనిపించింది. మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేసే 16 ఏళ్ల కుర్రాడు లీ సెల్కో కూడా ఐఫోన్ కోసం క్యూ కట్టాడు. వరుసలో అతడిది 25వ ప్లేస్. ఐఫోన్ దక్కడం గ్యారెంటీ అన్నమాటే. అప్పుడే తనకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్లేస్‌ను 500 డాలర్ల (దాదాపు రూ.30 వేలు)కు అమ్మకానికి పెట్టాడు. కుర్చీలో పెట్టిన వైట్ బోర్డుపై తన 25వ నంబరు ప్లేస్‌ను విక్రయిస్తున్నట్టు రాసి దానిని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తనది 25వ నంబరు కావడంతో ఐఫోన్ దక్కించుకోవడం వంద శాతం పక్కా అని హామీ ఇచ్చాడు.  

ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి పోస్ట్ చూసిన ఒక ఔత్సాహికుడు సీటును కొనుక్కునేందుకు ముందుకొచ్చాడు. కాగా, అతడి పోస్టుపై ప్రశంసలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నువ్వో గొప్ప వ్యాపారవేత్తవు కావడం పక్కా’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా, అతడి పోస్టింగ్ మాత్రం పిచ్చిపిచ్చిగా వైరల్ అయింది.

  • Loading...

More Telugu News