ashis nehra: 'దాదా! భయపడకు' అంటూ బంతిని తీసుకుని పాక్ పై గెలిపించిన వీరుడు ఆశిష్ నెహ్రా!: హేమంగ్ బదానీ
- నెహ్రాతో అనుభవాన్ని గుర్తు చేసుకున్న హేమంగ్ బదానీ
- పాక్ కు చివరి ఓవర్ లో పది పరుగులు కావాలి
- ఎవరితో బౌలింగ్ చేయించాలా? అని దాదా సందిగ్ధం
- బంతి తీసుకున్న నెహ్రా పాక్ కు విజయాన్ని దూరం చేశాడు
టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్రా క్రికెట్ నుంచి తాజాగా వీడ్కోలు తీసుకోవడంతో ఒక్కొక్కరు అతనితో గల అపూర్వమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా నెహ్రా సమకాలీనుడు హేమంగ్ బదానీ ఆసక్తికర సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో పెట్టిన ఆ వీడియోలో హేమంగ్ బదానీ ఏం చెప్పాడంటే...‘2004లో జరిగిన ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది. కరాచీలో భారత్, పాకిస్థాన్ చావోరేవో అన్నట్టుగా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన మేము 350 స్కోర్ చేశాం.
పాకిస్థాన్ కూడా దీటుగా ఆడింది. రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో పాక్ విజయానికి తొమ్మిదో, పదో పరుగులు అవసరం. అప్పుడు చివరి ఓవర్ ఎవరికివ్వాలా? అని కెప్టెన్ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా.. సౌరవ్ దగ్గరికొచ్చాడు. ‘దాదా నేను వేస్తా. నువ్వు భయపడకు. మ్యాచ్ గెలిపించి తీరుతా’ అన్నాడు. అన్నట్టే ఆ చివరి ఓవర్ లో మూడు పరుగులిచ్చి మొయిన్ ఖాన్ వికెట్ తీసిన నెహ్రా చెప్పినట్టే భారత్ కు విజయాన్ని అందించాడని హేమంగ్ బదానీ గుర్తు చేసుకున్నాడు.